బరంపురం: ఒడిశా రాష్ట్రంలో  29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో  22 మంది మహిళలు కూడ ఉన్నారు. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఆరుగురిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో  పోలీసులు  వారిని అరెస్ట్ చేశారు.

ఒడిశా రాష్ట్రంలోని  గంజాం జిల్లాలోని గోపపూర్ గ్రామంలో ఆరుగురు వ్యక్తులు  చేతబడి చేస్తున్నారనే నెపంతో  29 మంది దాడికి పాల్పడ్డారు.ఈ ఆరుగురి దంతాలను తీసేశారు. మనుషుల అశుద్దాన్ని కూడ వారికి బలవంతంగా తినిపించారు.

బాధఇతులంతా 60 ఏళ్లకు పైబడినవారే. బాదితులను పోలీసులు స్థానిక  ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటన మంగళవారం నాడు మధ్యాహ్నం చోటు చేసుకొంది.  ఈ ఆరుగురిపై దాడికి పాల్పడే ముందు  గ్రామస్తులు  సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు మహిళలు మృతి చెందారు. 

అంతేకాదు  గ్రామానికి చెందిన ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటంతటికి ఈ ఆరుగురు చేతబడి చేశారని  గ్రామస్తులు అనుమానంతో దాడికి పాల్పడ్డారు.
ఇళ్లలో ఉన్నఆరుగురిని బలవంతంగా బయటకు తీసుకొచ్చి వారి దంతాలను తీసేశారు. ఆ తర్వాత మానవుడి వ్యర్థాలను తినిపించారు.

ఈ ఆరుగురు వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఎస్పీ బ్రిజేష్ రాయ్ గ్రామాన్ని సందర్శించారు. బాధితులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆరుగురిపై దాడికి పాల్పడిన 29 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ రాయ్ తెలిపారు.