నాగపూర్: ప్రియుడితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన విషయాన్ని కప్పిపుచ్చడానికి ఓ యువతి కిడ్నాప్ కట్టుకథ అల్లింది. మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల యువతి ప్రియుడితో జల్సా చేసిన విషయం తన కుటుంబ సభ్యులకు తెలియకూడదని తనను కిడ్నాప్ చేశారని కట్టుకథ చెప్పింది.

యువతి గుట్టును పోలీసులు దర్యాప్తు చేసి రట్టు చేశారు. తన ఇష్టంతోనే ప్రియుడితో వెళ్లిన యువతి తనను కిడ్నాప్ చేశారని కథ అల్లిందని పోలీసులు బుధవారంనాడు చెప్పారు. తనను కిడ్నాప్ చేశారని యువతి తన తల్లిదండ్రులు వెంటరాగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గిట్టిఖదాన్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ సునీల్ గంగుర్దే చెప్పారు. 

కాలేజీకి వెళ్తుండగా వాహనంలో వచ్చిన నలుగురు వ్యక్తులు తమ కూతురిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లారని, వారి నుంచి తప్పించుకుని తమ కూతురు ఇంటికి చేరిందని యువతి తల్లిదండ్రులు ఫిర్యాదులో చెప్పారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు యువతి చెప్పిన సంఘటనా స్థలానికి ఆమెను తీసుకుని వెళ్లారు. నాగపూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఆ స్థలానికి చేరుకున్నారు. అయితే, యువతి చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. 

దాంతో పోలీసులు కాలేజీకి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ యువతి మోటార్ సైకిల్ పై ఓ వ్యక్తితో వెళ్తున్న దృశ్యాలు వారికి కనిపించాయి. ఆ దృశ్యాలను కుటుంబ సభ్యులకు చూపించి, యువతిని పోలీసులు ప్రశ్నించారు. దీంతో యువతి అసలు విషయం చెప్పింది. 

తన ప్రియుడితో యువతి తన ఇష్టంతోనే నాగపూర్ శివారులోకి వెళ్లిందని, ఆ తర్వాత ఆమెను అతను ఇంటి వద్ద దింపాడని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యులు తనను దూషిస్తారనే భయంతో యువతి కిడ్నాప్ కథ అలినట్లు తెలిపారు.

తల్లిదండ్రులు తాను చెప్పిన కథను నమ్ముతారని యువతి భావించింది. అయితే, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రహస్యం బయటపడింది.