Asianet News TeluguAsianet News Telugu

చార్‌ధామ్ యాత్ర: రెండు నెలల్లో 203 మంది యాత్రికులు మృతి

ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర మే 3వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 203 మంది యాత్రికులు మరణించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఎక్కువ మంది గుండె పోటు, ఇతర అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్టు పేర్కొంది.
 

203 pilgrims died in char dham yatra so far which began on may 3rd
Author
New Delhi, First Published Jun 27, 2022, 4:26 PM IST

న్యూఢిల్లీ: ఏడాదికి ఒక సారి నిర్వహించే చార్ ధామ్ యాత్ర అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ యాత్రలో పాల్గొని హిమాలయాలకు చేరుతారు. అక్కడ దేవుళ్లను దర్శించుకుని వెనుదిరుగుతారు. కానీ, ఈ యాత్ర ఎంతో కష్టంగా ఉంటుంది. శిఖర కొండలు ఎక్కుతూ కఠిన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటూ యాత్ర చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యం పాలైన వారికి యాత్ర మరీ కఠినంగా సాగుతుంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు చార్ ధామ్ యాత్ర చేపట్టలేదు. ఈ సారి మే 3వ తేదీన ఈ యాత్ర ప్రారంభమైంది. కానీ, అందరికీ అనుకూలంగానే ఈ యాత్ర సాగలేదు. ఇప్పటి వరకు ఈ యాత్రలో 203 మంది భక్తులు మరణించారు.

చార్ ధామ్ యాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 203 మంది భక్తులు మరణించినట్టు ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇందులో ఎక్కువ మంది గుండె పోటు, ఇతర అనారోగ్య సమస్యలతో మరణించినట్టు పేర్కొంది.

ఈ 203 మందిలో 97 మంది యాత్రికులు కేదార్‌నాథ్ యాత్ర దారిలో మరణించారు. కాగా, 51 మంది భద్రినాథ్ ధామ్ దారిలో చనిపోయారు. 13 గంగోత్రి, 42 మంది యమునోత్రి దారుల్లో మరణించారు.

గత నెల 3వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.25 లక్షల మంది చార్ ధామ్ ను దర్శించుకున్నారు. అయితే, గతేవారం ఈ భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

చార్ ధామ్ యాత్ర చాలా రద్దీగా సాగనున్న తరుణంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు చేసింది. ముందు జాగ్రత్తలపై అలర్ట్ చేసింది. యాత్రికులు అందరూ ముందుగా తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని, మెడికల్ ఎగ్జమైన్ చేసిన తర్వాతే హిమాలయాల్లోని ఈ ఆలయాలకు ప్రయాణం ప్రారంభించాని ప్రభుత్వం సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios