Bengaluru: జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి రామనగరలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, తాను 2028 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయననీ, రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
JDS leader HD Kumaraswamy: "ఇదే నా చివరి ఎన్నిక, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను పోటీ చేయను. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చెన్నపట్న నుంచి పోటీ చేయాలంటూ" కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి షాకింగ్ కామెంట్ చేశారు. అయితే, కొద్ది గంటల్లోనే ఆయన యూటర్న్ తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి రామనగరలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, తాను 2028 తర్వాత ఎన్నికల్లో పోటీ చేయననీ, రాబోయే కర్ణాటక ఎన్నికలే తనకు చివరివంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఈ ప్రకటన చేసిన గంటలోపే తాను తన రాజకీయ రిటైర్మెంట్ గురించి చెప్పలేదని పేర్కొన్నారు. "నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు గుడ్ బై చెప్పను. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్న నుంచి కార్యకర్తలను బరిలోకి దింపుతా. అప్పుడు నేను వేరే ప్రాంతంలో నిలబడే అవకాశం రావచ్చు' అని కుమారస్వామి పేర్కొన్నారు.
చెన్నపట్నలోని దొడ్డమలూరు గ్రామ సమీపంలో జరిగిన ఓ కార్యక్రమంలో కుమారస్వామి మాట్లాడుతూ ఇది బెంగళూరు మిల్క్ యూనియన్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యక్రమం కాదన్నారు. ఇదీ జయముత్తు కో-ఆపరేటివ్ సొసైటీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చేందుకు బమూల్ నిరాకరించింది. అధికారులంతా ఈ విషయంలో ఎలా ప్రవర్తించారో తనకు తెలుసునంటూ మండిపడ్డారు. అలాగే, తాను ఎవరికీ భయపడటం లేదనీ పేర్కొన్నారు. ఒక్క ప్రజలకు మాత్రమే తాను భయపడుతాననీ, వారికి జవాబుదారీగా ఉంటానని తెలిపారు.
"నేను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ అహంకారం ప్రదర్శించలేదు. మేం ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు. కానీ మాతో ఉన్న వ్యక్తులు ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈ తాలూకా ప్రజలు ఆత్మగౌరవంతో నడుస్తున్నారు. ఆ రోజు కాళ్లు, నోటి జ్వరంతో ఆవులు చనిపోయినప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి? ఈ నామినేటెడ్ సభ్యుడు లింగేష్ కుమార్ ఎక్కడ ఉన్నారు? ఇలాంటి తప్పుడు మాటలను ప్రజలు నమ్మరని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలంటూ వారిపై మండిపడ్డారు.
అలాగే, "నేను లేకపోయినా రామనగర నియోజకవర్గ ప్రజలు మమ్మల్నిగెలిపిస్తారు. నన్ను రామనగర జిల్లా ప్రజలు పెంచారు. నేను హసన్ జిల్లాలో పుట్టి ఉండవచ్చు. కానీ రాజకీయంగా జన్మనిచ్చింది రామనగరమే. నాపై దుష్ప్రచారం చేస్తున్నారని" అధికార బీజేపీ నాయకులపై మండిపడ్డారు. తాను మరోసారి ముఖ్యమంత్రిని అయితే స్త్రీశక్తి స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని చెప్పారు.
ఇదిలావుండగా, హసన్ నుంచి భవానీ రేవణ్ణకు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై చెన్నపట్నలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. "ప్రతి ఒక్కరూ నిరసన తెలుపుతున్నారు. స్వరూప్ మద్దతుదారులు నిన్న ఆ పని చేశారు. నేడు రేవణ్ణ తరఫున భవానీ చేస్తున్నారు. అన్నీ గమనించాను. అందరికీ టికెట్లు ఇవ్వలేం. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాము" అని చెప్పారు. హసన్ టికెట్ వ్యవహారంలో మాజీ ప్రధాని దేవెగౌడ జోక్యం చేసుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 'ప్రస్తుతం దేవెగౌడ ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. ఈ విషయంలో వారు సొంతంగా నిర్ణయం తీసుకోవడం అసాధ్యం. అందుకే అందరం కూర్చొని చర్చించి పరిష్కరించుకుంటామని' చెప్పారు.
