ఉత్తరప్రదేశ్‌లో మరో కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. 2005 ఎమ్మెల్యే మర్డర్ కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి దారుణ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉమేష్ పాల్‌ను పట్టపగలే కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు అర్బాజ్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు.
లక్నో: 2005లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ప్రధాన నిందితుడు ప్రస్తుతం గుజరాత్‌లో జైలులో ఉన్నాడు. ఈ ప్రధాన సాక్షి అయినటువంటి ఉమేష్ పాల్‌ను కొందరు దుండగులు ఇటీవలే పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా కాల్చి చంపారు. ప్రయాగ్‌రాజ్‌లో అతని నివాసం ఎదుటే హ్యుందాయ్ కారు వెనుక సీటులో నుంచి ఉమేష్ పాల్ దిగుతూ ఉండగా.. అక్కడే కాపుకాస్తూ వేచి ఉన్న దుండగులు వెనుక నుంచి వచ్చి కాల్పులు జరిపారు. ఎదురుగా ఉన్న చిన్న సందులోకి ఉమేష్ పాల్ ఉరికే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ సందులోకీ వచ్చి అతనిపై కాల్పులు జరిపి దుండగులు పారిపోయారు. ఈ దాడిని అడ్డుకునే క్రమంలో ఉమేష్ పాల్ వెంట ఉన్న గార్డులు కూడా తీవ్రంగా బుల్లెట్ గాయాలపాలయ్యారు. ఉమేష్ పాల్‌ను హాస్పిటల్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉమేష్ పాల్ పై కాల్పులు జరిపిన ఘటనలో ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు తాజాగా వార్త వచ్చింది. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడు అర్బాజ్ చాతిలో బుల్లెట్లు దిగాయి. ధూమాన్‌గంజ్‌లో నెహ్రూ పార్క్ సమీపంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో అర్బాజ్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. మరో ఇన్‌స్పెక్టర్ రాజేశ్ మౌర్య చేతికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.
Also Read: యూపీ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన సాక్షి దారుణ హత్య.. పట్టపగలే నడి రోడ్డుపై కాల్చివేత.. (వీడియో)
అర్బాజ్‌ను హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే అతను మరణించి ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఎమ్మెల్యే మర్డర్ కేసులో సాక్షి ఉమేష్ పాల్ దారుణ హత్యలో నిందితుడు అర్బాజ్ ఈ నెల 24వ తేదీన హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. కానీ, అతను అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ (అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు)ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో యూపీ పోలీసులతో ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ అర్బాజ్ మరణించాడని వివరించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు మాఫియాలు, క్రిమినల్స్ పై కఠినంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేష్ పాల్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి బయటే కాల్చి చంపారని ప్రయాగ్ రాజ్ పోలీసు చీఫ్ రమిత్ శర్మ విలేకరులకు తెలిపారు. అక్కడ రెండు బాంబులు పేల్చినట్టు ధ్రువీకరించారు. చిన్న ఫైర్ ఆర్మ్‌తో వారిపై కాల్పులు జరిపారని వివరించారు.
