ఓ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం విద్యార్థి మెడకు చుట్టుకుంది.. తీరా విషయం వెలుగులోకి వచ్చేసరికి విద్యార్థిదే తప్పు ఉండొచ్చంటూ కాలేజీ రిజిస్ట్రార్ ప్లేట్ ఫిరాయించడం కొస మెరుపు. బీహార్ లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

నటుడు ఇమ్రాన్ హష్మీ, నటి సన్నీ లియొన్ కొడుకు ఓ కాలేజీలో చదువుతున్నాడు. ఆశ్చర్యంగా ఉందా.. నమ్మాలని లేదా.. అప్పుడే ఏమయింది మరిన్ని విషయాలు విన్నాక అప్పుడు ఆశ్చర్యపోండి.. వీరిద్దరికీ పెళ్లి అవ్వడమే కాదు, వీరిద్దరు ఉత్తర బిహార్‌లోని ఓ టౌన్‌లో ఉంటున్నారని.. వీరికి 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆశ్చర్యంతో పాటు గందరగోళంలో పడి మూర్ఛవచ్చినట్టవుతుందా?

సేమ్ టు సేమ్ ఆ విద్యార్థి పరిస్తితి కూడా అలాగే ఉంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో బీహార్ లోని ఓ కాలేజీ స్టూడెంట్‌ అడ్మిట్‌ కార్డ్‌ మీద అతడి తల్లి దండ్రుల పేర్ల స్థానంలో ఇమ్రాన్‌ హష్మి, సన్నీ లియోన్‌ పేర్లు ప్రింట్‌ చేశారు కాలేజీ యాజమాన్యం.  

వివరాల్లోకి వెడితే.. కుందన్‌ కుమార్‌(20) అనే యువకుడు ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతుండటంతో హాల్‌ టికెట్‌ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు. దాన్ని చూసిన అతడు ఒక్కసారి షాక్‌ అయ్యాడు. 

ఎందుకంటే దాని మీద అతడి తండ్రి పేరుకు బదులు ఇమ్రాన్‌ హష్మి అని.. తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్‌ అని ఉంది. దీని గురించి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఈ అడ్మిట్‌ కార్డ్‌ తెగ వైరలవుతోంది. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ రామ్‌ కృష్ణ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘విద్యార్థి వల్లనే ఈ తప్పిదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. దర్యాప్తు చేస్తున్నాం.. బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.