చార్‌ధామ్ యాత్ర ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ యాత్ర మొదలైన ఆరు రోజుల్లోనే 20 మంది మరణించారు. 14 మంది యాత్రికులు, ఓ నేపాలీ కార్మికుడు యమునోత్రి, గంగోత్రి ధామ్‌లలో మరణించారు. కేదార్‌నాథ్‌లో ఐదుగురు, బద్రినాథ్‌లో మరొకరు మృతి చెందారు. 

న్యూఢిల్లీ: ఏడాదికి ఒక సారి నిర్వహించే చార్‌ధామ్ యాత్రకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్నది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యాత్ర చేపడతారు. ఈ యాత్రపై ప్రభుత్వ నోటిఫికేషన్‌ కోసం యాత్రికులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కఠోర శీతోష్ణస్థితుల గుండా సాహసోపేత యాత్ర చేసి దైవ దర్శనం చేసుకుంటారు. ప్రతి ఏడాది ఈ యాత్ర ఎంతో విశిష్టంగా చేపడతారు. కానీ, కరోనా కారణంగా గత రెండు మూడు సంవత్సరాలుగా యాత్ర చేపట్టలేదు. ఈ సారి మే 3వ తేదీనే చార్‌ధామ్ యాత్ర మొదలైంది. కాగా, మొదలైన ఆరు రోజుల్లోననే 20 మంది యాత్రికులు మృతి చెందారు.

ఉత్తరాఖండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్స్‌తో మరణించారని తెలిపింది. హృద్రోగ సమస్యలతోపాటు ఎత్తైన ప్రాంతాల గుండా ప్రయాణించడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించింది. 14 మంది యాత్రికులు యమునోత్రి, గంగోత్రి ధామ్‌లలో మరణించారు. ఇందులో ఒక నేపాలీ కార్మికుడు కూడా ఉన్నాడు. వీటితోపాటు కేదార్‌నాథ్‌లో ఐదుగురు, బద్రినాథ్‌లో మరొకరు మరణించారని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఆరు రోజుల్లో 20 మంది యాత్రికులు మరణించినట్టు అయిందని పేర్కొంది. ఈ పరిణామంపై యాత్ర నిర్వాహకులు, పాలకులు ఆందోళనలు చెందుతున్నారు.

చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు కేదార్‌నాథ్, యమునోత్రి ధామ్‌కు వెళ్లడానికి కఠినమైన దారుల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల గుండా ప్రయాణించడంతో వారు ఆక్సిజన్ కొరత, కోల్డ్‌తో బాధపడుతారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో యాత్ర చేస్తున్న హై బీపీ, డయాబెటిస్, క్యాన్సర్, ఆస్థమా పేషెంట్ల ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తుంది.

కాగా, చార్ ధామ్ యాత్ర మార్గంలో భక్తుల కోసం ప్ర‌యివేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందించే ఉచిత ఆరోగ్య సేవలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం (మే 2) జెండా ఊపి ప్రారంభించారు. చార్ ధామ్ యాత్ర మే 3 నుంచి ప్రారంభం కానుంది. భక్తులకు ఉచిత ఆరోగ్య సేవలను ప్రారంభించిన అనంత‌రం ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామి మీడియాతో మాట్లాడుతూ.. "చార్ ధామ్ యాత్ర ప్రజలకు సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుందని మరియు యాత్ర అంతటా వారు ఆరోగ్యంగా ఉండాలని మేము కోర‌కుకుంటున్నాము. సామాజిక సంస్థకు చెందిన వైద్యులు మరియు నర్సుల బృందాలు ఈ సమయంలో భక్తులకు ఆరోగ్య సేవలను రాష్ట్రవ్యాప్తంగా యాత్ర అందిస్తాయి" అని తెలిపారు. 

చార్ ధామ్ యాత్ర‌కు పెద్ద ఎత్తున భ‌క్తుల వ‌చ్చే అవ‌కాముంద‌నీ, దీనికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుటున్నామ‌ని తెలిపారు. చార్ ధామ్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికుల రోజువారీ పరిమితిని నిర్ణయించింది. బద్రీనాథ్ వద్ద రోజుకు 15,000, కేదార్‌నాథ్‌కు 12,000, గంగోత్రికి 7,000 మరియు యమునోత్రికి 4,000 మంది యాత్రికులను అనుమతిస్తున్నట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ ఏర్పాటు 45 రోజుల పాటు ఉంటుంద‌ని తెలిపింది. అలాగే, ఇక్క‌డ‌కు వ‌చ్చే యాత్రికులు ఈ సంవత్సరం క‌రోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ లేదా కోవిడ్-19 టీకా సర్టిఫికేట్ తీసుకెళ్లడం తప్పనిసరి కాదని పేర్కొంది. ఉత్తరాఖండ్ వెలుపలి నుండి వచ్చే ప్రయాణికులు మరియు యాత్రికుల కోవిడ్ -19 పరీక్షలను నిర్వహించడంలో గందరగోళాన్ని తొలగించడానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు అంతకుముందు చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.

యాత్రికులు మరియు భక్తులందరూ ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర కోసం పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. యమునోత్రి ధామ్ తలుపులు మే 3న తెరవబడతాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం తెలిపారు. "మే 03, అక్షయ తృతీయ శుభ సందర్భంగా యమునా దేవికి అంకితం చేయబడిన "యమునోత్రి ధామ్" తలుపులు తెరుచుకుంటాయి. మీ భక్తులందరికీ భక్తి, సాఫీగా మరియు ఆహ్లాదకరమైన చార్ధామ్ యాత్రను కోరుకుంటున్నాను. #ChardhamYatra2022" అని సీఎం ట్వీట్ చేశారు.