కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. ముంబయి, ఢిల్లీ నగరాల్లో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. తాజాగా ఈ కరోనా వైరస్ ఢిల్లీ మెట్రోలోనూ కలకలం రేపింది. ఢిల్లీ మెట్రోరైలు కార్పోరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తమ సంస్థలో పని చేసే వివిధ స్థాయి ఉద్యోగులకు వైరస్ సోకినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. 

దీనిపై ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) ట్వీట్‌ చేస్తూ.. ‘దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దానిపై పోరాడుతున్నాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే అన్ని చర్యలు తీసుకొని మెట్రో సర్వీసులను పరుగులు పెట్టించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ’ ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టరును అధికారులు ట్వీట్ చేశారు.

మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు శానిటైజ్ చేయిస్తూ కరోనా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రోరైలు అధికారులు వెల్గడించారు. కాగా ఢిల్లీలో ఇప్పటిదాకా.. 23,645 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 606 మంది మరణించారు. 9,542 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఇదిలా ఉండగా... భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగు‍తోంది. తాజా గణాం​కాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. దేశంలో ఇప్పటివరకు 96,563 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రతిరోజూ భారత్ లో దాదాపు పదివేల కేసులు నమోదౌతుండటం అందరినీ కలవర పెడుతోంది.