కరోనాతో పోరాడి ఓడిన డాక్టర్.. ఖననం చేయకుండా అడ్డుకొని..
ఆయనను ఖననం చేసేందుకు కీల్పాక్ సమీపంలోని వెల్లంగాడు స్మశానవాటికకు తరలించారు. అంబులెన్స్ లో ఆయన మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అయితే.. అప్పటికే విషయం తెలుసుకున్న ఆ స్మశానవాటిక హౌసింగ్ బోర్డు క్వార్టర్స్ లో నివసిస్తున్నవారంతా అక్కడికి చేరుకున్నారు.
కరోనా వైరస్ సోకి ఓ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎందరో ప్రాణాలు కాపాడిన వైద్యుడు వైరస్ కాటుకి బలయ్యాడు. కాగా... ఆయన అంత్యక్రియలను సైతం జరగకుండా స్థానికులు అడ్డుకున్నారు. కనీసం శవాన్ని ఖననం కూడా చేయనివ్వలేదు. పైగా అంబులెన్స్ పై రాళ్లతో దాడి చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన న్యూరాలజిస్టు అయిన డాక్టర్(55) కి ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయనను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. అదే సమయంలో సదరు డాక్టర్ కుమార్తెకు కూడా వైరస్ సోకడం గమనార్హం. ఆమెను మరో ప్రవైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ క్రమంలో ఆయనను ఖననం చేసేందుకు కీల్పాక్ సమీపంలోని వెల్లంగాడు స్మశానవాటికకు తరలించారు. అంబులెన్స్ లో ఆయన మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు. అయితే.. అప్పటికే విషయం తెలుసుకున్న ఆ స్మశానవాటిక హౌసింగ్ బోర్డు క్వార్టర్స్ లో నివసిస్తున్నవారంతా అక్కడికి చేరుకున్నారు.
ఆ స్మశానంలో కరోనా సోకిన వ్యక్తిని ఖననం చేయడానికి వీలులేదంటూ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అంబులెన్స్ పై రాళ్ల దాడి చేశారు. డాక్టర్ మృతదేహంపాటు వెళ్ళిన ఇద్దరు తీవ్రంగా గాయ పడ్డారు. స్థానికుల దాడితో భీతిల్లిన సిబ్బంది డాక్టర్ మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఆ డాక్టర్‌కు చెందిన ఆస్పత్రికి చేర్చేందుకు బయలుదేరి మార్గమధ్యలో కీల్పాక్ వైద్యకళాశాల ఆస్పత్రిలో గాయపడిన నలుగురు చికిత్స కోసం చేరారు.
ఆ లోపున ఈ విషయం తెలుసుకున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గట్టి పోలీసు భద్రత మధ్య డాక్టర్ మృత దేహాన్ని అంబులెన్స్‌లో సోమవారం వేకువజాము ఒంటిగంట కు వెల్లంగాడు శ్మశానవాటికకు చేర్చారు. రెండు గంటలకు డాక్టర్ మృతదేహాన్ని ఆ శ్మశానవాటికలో ఖననం చేసి అందరూ తిరుగుముఖం పట్టారు.
డాక్టర్ మృతదేహాన్ని శ్మశానవాటికలోకి అనుమతించ కుండా అడ్డుకున్నందుకుగాను 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగిం చడం, హింసకు పాల్పడటం, ప్రభుత్వ వాహనంపైదాడి జరుపటం తదితర నేరారోపణలపై వీరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.