శబరిమల ఆలయం మళ్లీ తెరుచుకుంది. బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి.. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.  దీంతో.. మహిళలు ప్రవేశించి ఆలయం అపవిత్రమైందన్న భావనతో ఆలయాన్ని మూసివేశారు. 

ఆలయాన్ని మూసివేసి శుద్ధి కార్యక్రమం చేపట్టారు. దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలు మూసివేశారు. సంప్రోక్షణ తర్వాత శబరిమల ఆలయాన్ని తెరిచి భక్తులకు అయ్యప్ప దర్శనానికి అనుమతినిచ్చారు.
 
బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు ఈరోజు తెల్లవారుజామున 3:45 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. ఇటీవల వీళ్లు ఒకసారి ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. అప్పుడు అయ్యప్ప భక్తులు వీరిని అడ్డుకున్నారు.

నిన్న మహిళా సంఘాలు కేరళ వ్యాప్తంగా మానవహారం నిర్వహించిన తర్వాత ఇప్పుడు పోలీసులు, ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కొందరు యూనిఫాంలో ఉన్న పోలీసులు, మఫ్తీ పోలీసులు వారిని స్వయంగా ఆలయ గర్భ గుడిలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.