ఇద్దరు అక్కాచెల్లెళ్లు... ఇద్దరు వయసు పైబడిన వాళ్లే. తమకు వయసు ఎలాగూ పెరిగిపోతోంది.. వయసు పెరిగిపోతే రోగాలు పిలవకుండానే వచ్చేస్తాయి.. అప్పుడు బంధువులను, బిడ్డలను  ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని ముందు నుంచే రూపాయి రూపాయి కూడగట్టుకున్నారు. తీరా అవసరానికి వాటిని తీసి.. బంధువులకు చూపిస్తే.. ఆ డబ్బులు పనికి రావని చెప్పారు. అవన్నీ చెల్లని నోట్లని తెలిసి.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాధపడుతున్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం తిర్పూర్ కి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తంగమాల్(78), రంగమ్మాల్(75).. చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వయసు మళ్లే కొద్ది తతమకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని.. లేదా ఏదో ఒక రోజు కన్నుమూస్తే.. బంధువులు తమకు అంత్యక్రియలు చేయడానికైనా పనికి వస్తాయి కదా అని దాదాపు పది సంవత్సరాల నుంచి రూపాయి, రూపాయి కూడబెడుతూ వచ్చారు.

దాదాపు వారిద్దరూ కలిసి రూ.46వేలు కూడపెట్టారు. వయసు పెరగడంతో ఈ మధ్య ఇద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. బంధువులను పిలిచి తమ వద్ద డబ్బు ఉందని.. తమకు ట్రీట్మెంట్ ఇప్పించమని కోరారు. తీరా ఆ డబ్బు చూస్తే... అందులో అన్నీ చెల్లని నోట్లు ఉండటం గమనార్హం. 2016లో మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇందులో భాగంగా రూ.వెయ్యి, రూ.500నోట్లు రద్దు చేశారు. వాళ్లకి ఆ విషయం తెలియక వాటిని దాచిపెట్టుకున్నారు. తీరా వాళ్లకి ఆ విషయం బంధువులు చెప్పారు. దీంతో.. వాళ్లు బాగా బాధపడుతున్నారు. తంగమాల్ రూ.22వేలు, రంగమాల్ రూ.24వేలు దాచిపెట్టగా... అన్నీ రద్దైన నోట్లు కావడం గమనార్హం. వారిద్దరూ ఏవో చిన్న పని చేసుకుంటూ బతుకుతున్నారని.. అందుకే వాళ్లకి ఈ విషయం తెలీదని బంధువులు చెబుతున్నారు.