రానున్న రోజుల్లో మరో రెండు దేశీయ కోవిడ్-19 వ్యాక్సిన్‌లు (Two more indigenous Covid vaccines) అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Health Minister Mansukh Mandaviya ) లోక్‌సభలో తెలిపారు. 

కరోనాపై భారతదేశం పోరు కొనసాగిస్తుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఇప్పటికే దేశంలో అర్హులైన వయోజనుల్లో 50 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నట్టుగా కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్‌లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో మరో రెండు దేశీయ కోవిడ్-19 వ్యాక్సిన్‌లు (Two more indigenous Covid vaccines) అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా (Health Minister Mansukh Mandaviya ) లోక్‌సభలో తెలిపారు. 

రెండు కొత్త వ్యాక్సిన్‌లకు సంబంధించిన మూడవ దశ ట్రయల్ డేటా సమర్పించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ‘రెండు వ్యాక్సిన్‌ల డేటా, ట్రయల్స్ విజయవంతమవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ రెండు కంపెనీలు భారత్‌కు చెందినవే. పరిశోధన, తయారీ కూడా దేశంలోనే జరిగాయి’ అని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇక, ప్రభుత్వ సహాయంతో భారతీయ శాస్త్రవేత్తలు 9 నెలల్లోనే ఒక కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చెందారని మాండవియా గుర్తుచేశారు. 

ఒమిక్రాన్ వేరియంట్ నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో మ‌రింత వేగాన్ని పెంచిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, కోవిడ్ వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ మ‌రో ఘ‌న‌త సాధించింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. టీకాలు తీసుకోవ‌డానికి అర్హులైన దేశ జనాభాలో 50 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు (రెండు డోసుల వ్యాక్సిన్‌) ఇచ్చిన‌ట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాటికే భార‌త్ ల‌క్ష్యాన్ని చేరుకుంద‌ని పేర్కొంది. 

ఈ ఘనతపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ‘భారత క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో మరో మైలురాయిని అందుకుంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కొన‌సాగుతున్న ఈ పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇదే వేగంగా ముందుకు వెళ్ల‌డం అత్యంత ముఖ్య‌మైన‌ది. దీనికి సానుకూలంగా ప్ర‌జ‌లు మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం కీల‌కం. అలాగే, క‌రోనా నిబంధ‌న‌లు సైతం పాటించండి’ అంటూ ట్వీట్ చేశారు.