పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. సెప్టెంబర్ 4న రాష్ట్ర ఉత్తర ప్రాంతంలోని జల్పాయ్‌గురిలో ఇద్దరు మైనర్ బాలికలపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఈ అవమాన భారం భరించలేక బాలికలిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో సెప్టెంబర్ 7న ఓ బాలిక మరణించింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖగేశ్వర్ రాయ్ అన్నారు.

14, 16 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు సెప్టెంబర్ 4న సాయంత్రం ఇంటికి దగ్గరలోని ఓ తోటకి వెళ్లారు. అక్కడ వారిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

తమపై జరిగిన దారుణాన్ని భరించలేక బాలికలిద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని గమనించిన స్థానికులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అక్క మరణించగా.. చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది.

కాగా బాధితురాళ్ల తండ్రి టీ తోటలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన బిడ్డలపై ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారి తండ్రి ఎమ్మెల్యేను కోరారు.

ఈ ఘటన జరిగిన రాజ్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాయ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు ఈ దారుణంపై పశ్చిమ బెంగాల్ పోలీసులు మౌనం దాల్చడంపై విమర్శలు వస్తున్నాయి.

ఈ రోజు ఉదయం బాలిక మృతదేహం వారి స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులపై వేళ్లు చూపిస్తూ వారు నిరసన తెలిపారు. కాగా, గత నెలలో ఇదే ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆమె మృతదేహం ఇంటి సెప్టిక్ ట్యాంక్‌లో లభ్యం కావడం కలకలం రేపింది.

అయితే ఇద్దరు బాలికలపై అత్యాచారానికి సంబంధించి ప్రధాన నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై స్పందించేందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నిరాకరించారు.