మహారాష్ట్రలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్ట్‌గా తెలుస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా.. వీరికి మావోలు తారసపడినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొందరు మావోలు తప్పించుకుని అడవిలోకి పారిపోయినట్లుగా సమాచారం. 

మరణించిన మహిళ నక్సల్‌ని మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వగా తెలుస్తోంది. ఈమె స్వగ్రామం నిర్మల్ జిల్లా కడెం. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అడవిని గాలిస్తున్నట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లోనే వుంది. ఈ నేపథ్యంలో ములుగు, భూపాలపల్లి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మృతురాలు లింగవ్వ భర్త.. అడెల్లు భాస్కర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా వున్నాడు. ఇతను పలు ఎన్‌కౌంటర్లలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.