సీజేఐగా డీవై చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తులు
సీజేఐగా డీవై చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవలే కొట్టేసింది. పిటిషనర్ పై రూ. 1 లక్షల ఖర్చుల భారాన్ని మోపింది. తాజాగా, ఈ ఆదేశాలను పున:సమీక్షించాలని, తనపై వేసిన రూ. 1 లక్షల భారాన్ని మాఫీ చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ విచారణ నుంచి ఇద్దరు న్యాయమూర్తులు తప్పుకున్నారు.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చి పిటిషనర్ పై రూ. 1 లక్ష జరిమానా విధించింది. తాజాగా, ఆ పిటిషనర్ మరో సారి కోర్టును ఆశ్రయించి.. తమ పిటిషన్‌ను తోసిపుచ్చే కోర్టు నిర్ణయాన్ని పున:సమీక్షించాలని కోరారు. ఈ రివ్యూ పిటిషన్ విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లు తప్పుకున్నారు.
ఈ పిటిషన్‌లో కొన్ని ఆరోపణలు కూడా చేశారని, ఈ పిటిషన్ విచారించలేమని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌ను జనవరి 16న వేరే ధర్మాసనం విచారిస్తుందని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ శర్మ సారథ్యంలోని డివిజన్ బెంచ్ తెలిపింది.
కాగా, కేంద్రం తరఫు కౌన్సెల్ వాదిస్తూ.. ఆ పిటిషనర్ పై కోర్టు ధిక్కరణ విచారణ చేపట్టాలని పేర్కొన్నారు.
సీజేఐగా డీవై చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఓ పిల్‌ను సంజీవ్ కుమార్ తివారీ వేశారు. ఈ పిటిషన్‌ను 2022 నవంబర్ 11వ తేదీన రూ. 1 లక్ష ఫైన్‌తో హైకోర్టు డిస్మిస్ చేసింది. తమని తాము యోధులుగా భావించి ప్రజా ప్రయోజనం పేరిట పైపైన తేలిపోయే ఆరోపణలతో రాజ్యాంగబద్ధంగా ప్రజల సేవ చేసే వారిని కించపరచరాదని ఆ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
Also Read: ఆశ్చర్యానికి గురి చేసిన సీజేఐ.. తొలిసారి ఇద్దరు కుమార్తెలతో సుప్రీంకోర్టుకు ..
తాజా రివ్యూ పిటిషన్‌లో గత ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతేకాదు, తమపై విధించిన రూ. 1 లక్ష ఖర్చు భారాన్ని మాఫీ చేయాలని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్టు) నిబంధనలు పాటిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం జరిగిందని ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. అయినా.. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిందని సీరియస్ అయింది.