Supreme Court: తాజాగా సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, కోర్టులో జడ్జిల సంఖ్య 34కు పెరిగింది. కొత్తగా నియమితులైన ఇద్దరు న్యాయమూర్తులు.. జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ సుప్రీం జడ్జిలుగా ప్రమాణం చేయనున్నారు. వీరి ప్రమాణ స్వీకారం తర్వాత సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది.
Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చాలా కాలం తరువాత న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయికి (34) చేరుకుంది. తాజాగా సుప్రీంకోర్టులో మరో ఇద్దరు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 కు పెరిగింది. కొత్తగా నియమితులైన ఇద్దరు జడ్జీలు.. జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ అరవింద్ కుమార్ .. వారు రెండు రోజుల్లో ప్రమాణం చేయనున్నారు.
వీరి ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు శుక్రవారం సుప్రీంకోర్టుకు నియమించబడ్డారని, దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య గరిష్టానికి చేరుకుందని ఆయన అన్నారు. వారికి తన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే.. జస్టిస్ రాజేశ్ బిందాల్ ఇప్పటి వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ..జస్టిస్ అరవింద్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. వీరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం జనవరి 31న కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకాలకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని న్యాయ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అంతకుముందు ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సోమవారం ప్రమాణం చేయించారు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తీర్మానం ప్రకారం.. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని మొత్తం ఆరుగురు సభ్యులు జస్టిస్ బిందాల్ ను ఏకగ్రీవంగా అంగీకరించారు, అయితే జస్టిస్ కుమార్ పేరుపై జస్టిస్ కెఎమ్ జోసెఫ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఈ న్యాయమూర్తుల చేరిక తర్వాత అలహాబాద్, గుజరాత్ హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రితింకర్ దివాకర్, జస్టిస్ సోనియా గిరిధర్ గోకాని నియమితులవుతారు. ఇద్దరూ తమ తమ హైకోర్టుల్లో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు. ఏప్రిల్ 16, 1961న జన్మించిన జస్టిస్ బిందాల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 62 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేయవలసి ఉంది, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో అతను మరో మూడేళ్లపాటు సేవలందించనున్నారు.
