ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో  వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. బుధవారం నాడు అర్ధరాత్రి నాలుగు సార్లు భూకంపం సంభవించింది. భూకంపాల కారణంగా గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 12 నిమిషాల వ్యవధిలో నాలుగు దఫాలు  భూకంపాలు సంభవించాయి. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. పాల్ఘర్ జిల్లాలోని దహను కేంద్రంగా భూకంపాలు వచ్చినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

భూకంప తీవ్రతకు దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భూకంపాలకు తోడుగా భారీ వర్షం కారణంగా ప్రజలు బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి.

2018 నవంబర్ మాసం నుండి ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు చోటు చేసుకొంటున్నాయి. దీంతో భూకంపాలు సంబంవించిన సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు ప్రజల్లో  అవగాహన కల్పిస్తున్నారు.