కేరళలో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్..
కేరళలో నిపా వైరస్ మరోసారి విజృంభించింది. కేరళలో నిపా వైరస్ సోకి ఇద్దరు మరణించారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే భయపడాల్సిన అవసరం లేదనీ, మరణించిన వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చికిత్స పొందుతున్నారని తెలిపారు.

కేరళలో నిపా వైరస్ మరోసారి విజృంభించింది. నిపా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. పరిస్థితిని సమీక్షించడానికి, సంక్రమణను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి కేంద్ర నిపుణుల బృందాన్ని కేరళకు పంపినట్లు చెప్పారు.
అప్రమత్తమైన ప్రభుత్వం
నిఫా వైరస్ వలన ఇద్దరూ చనిపోవడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే.. భయపడాల్సిన అవసరం లేదనీ, ఎందుకంటే మరణించిన వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు చికిత్స పొందుతున్నారని తెలిపింది. కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు నమోదయ్యాయని కేరళ ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఒకరి బంధువులను కూడా ఐసీయూలో చేర్చారు. ఈ మరణాల నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ జిల్లాలో అప్రమత్తమైంది. అధికారిక వర్గాల ప్రకారం.. కేరళకు చెందిన మరో నలుగురి నమూనాలను పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
ఆరోగ్య మంత్రి అత్యవసర భేటీ
అంతకుముందు.. కేరళ ప్రభుత్వం కోజికోడ్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు ముసుగులు ధరించాలని సూచించింది. పరిస్థితిని అంచనా వేయడానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన కోజికోడ్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉందని తెలిపారు. కోజికోడ్‌లో 2018, 2021 సంవత్సరాల్లో కూడా నిపా వైరస్ కారణంగా మరణాలు సంభవించడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. నిపా వైరస్ జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఇది కలుషిత ఆహారం ద్వారా లేదా ఒకరి నుండి మరొకరికి కూడా వ్యాపిస్తుంది.