న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. వ్యాక్సిన్   సన్నహాక కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు డ్రై రన్ ను నిర్వహించనున్నారు.

దేశంలోని ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు.

ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని రెండు జిల్లాల్లోని  నాలుగు జోన్లలో వ్యాక్సిన్  సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు చేయనున్నారు.ఇమ్యూనైజేషన్ తర్వాత ఏదైనా ప్రతికూల ఘటనలను ఎలా ఎదుర్కోవాలనే విషయమై కూడ డ్రైరన్ దృష్టి పెట్టనుంది. 

కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు అందించేందుకు ముందుగా యంత్రాంగాన్ని సంసిద్దం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ తెలిపారు.  జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒకటి లేదా రెండు జిల్లాల్లో డ్రైరన్ నిర్వహిస్తామన్నారు.

వ్యాక్సిన్ వేయడానికి వీలుగా 2360 మందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. వ్యాక్సినేటర్లు, ప్రత్యామ్నాయ వ్యాక్సినేటర్లు, కోల్డ్ చైన్ హ్యాండర్లు, పర్యవేక్షకులు,  డేటా మేనేజర్లు, ఆశా సమన్వయకర్తలతో సహా 7 వేల మందికి శిక్షణ ఇచ్చారు.

వచ్చే ఏడాది జనవరి మాసంలో ఏ సమయంలోనైనా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ, హైద్రాబాద్ విమానాశ్రయాల్లో టీకాను సురక్షితంగా నిల్వ చేయడంతో పాటు రవాణా చేసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నారు.మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వచ్చే ఆరేడు మాసాల్లో  వ్యాక్సిన్ వేయనున్నారు.