బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని సుళివాడిలో గల మారెమ్మ దేవాలయంలో పంపిణీ చేసిన ప్రసాదంలో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. పురుగుల మందు కలిపిన ప్రసాదం తినడం వల్లనే 11 మంది మృత్యువాత పడ్డారని, 80 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. 

ఫుడ్ పాయిజనింగ్ కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఇంచార్జీ మంత్రి పుట్టరంగ శెట్టి శనివారంనాడు చెప్పారు. చికిత్స పొందుతున్న బాధితులను శెట్టి పరామర్శించారు. దర్యాప్తు జరుగుతోందని, దోషులను శిక్షిస్తామని ఆయన చెప్పారు. 

 

ఇక్కడ రెండు గ్రూపుల మధ్య తగాదాలున్నాయని, ఏదో జరిగిందనే అనుమానం ఉందని ఆయన అన్నారు. బాధితుల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. 

బాధితుల్లో 47 మందిని కేర్ ఆస్పత్రికి, 17 మందిని జెఎస్ఎస్ ఆస్పత్రికి, ఇతరులను మైసూరులోని వివిధ ఆస్పత్రులకు తరిలించి వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 91 మందిని చామరాజనగర్ నుంచి మైసూరు తరలించినట్లు ఆయన తెలిపారు.