ఓ యువతి పుట్టినరోజే మృగాళ్ల పైశాచకత్వానికి  బలైంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ 19 ఏళ్ల యువతి గత నెల 7వ తేదీ తన పుట్టినరోజును జరుపుకుంది. స్నేహితుల ఇంట్లో బర్త్ డే వేడుకల కోసమని అందంగా ముస్తాబై ఇంటి నుంచి సంతోషంగా బయలుదేరింది.

అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి ఓంతో దిగాలుగా ఉండటంతో తల్లీదండ్రులకు అనుమానం వచ్చింది. అయితే కొన్నిరోజులు దీనిని పట్టించుకోనప్పటికీ రాను రాను కూతురు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడటం, వెక్కి వెక్కి ఏడవటం, లోలోపల కుమిలిపోతుండటంతో ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమించింది.

దీంతో తల్లీదండ్రులు యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లగా... ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగిందని చెప్పడంతో తల్లీదండ్రులు షాక్‌కు గురయ్యారు. అసలు ఏం జరిగిందని వారు యువతిని ప్రశ్నించగా ఆమె బర్త్‌డే రోజు జరిగిన ఘోరాన్ని బయటపెట్టింది.

పుట్టినరోజున స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వచ్చే సమయంలో నలుగురు వ్యక్తులు తనను అడ్డగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కన్నీటిపర్యంతమైంది. దీనిపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.