ప్రియురాలిని బెదిరించబోయి తానే గాయాలపాలయ్యాడు ఓ టీనేజర్. వీడియోకాల్ లో గర్ల్ ఫ్రెండ్ ను అంటించుకుంటానని బెదిరించాడు. అయితే ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో గాయాలపాలయ్యాడు. 

ముంబై : 19 ఏళ్ల యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ.. ఒంటికి నిప్పంటించుకున్నాడు ఈ ఘటన శాంతాక్రూజ్ లోని బాధితుడి నివాసంలోనే చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు బాధితుడిని సాగర్ పరశురామ్ జాదవ్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను 30 శాతం కాలిన తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. జాదవ్ సోమవారం అర్ధరాత్రి గణపతి విగ్రహాన్ని దర్శించుకుని వస్తూ.. రోడ్డు మీద ఫోన్లో మాట్లాడుతూ తన ప్రేయసితో గొడవ పడ్డాడు. 

ఆ తరువాత తన ఇంటికి వెళ్లాడు. మళ్లీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ లో వీడియో కాల్ చేసి మాట్లాడుతూ మళ్లోసారి గొడవపడ్డాడు. ఆమెను బెదిరించాలని తన మాట వినకపోతే షర్ట్ కు నిప్పంటించుకుంటానని బెదిరించాడు. నిప్పును చేతిలో పట్టుకున్నాడు. అయితే ఇంతలో ఆ నిప్పు కాస్త అతని కాటన్ షర్ట్ కి అంటుంది. దీంతో ఒక్కసారిగా మంటలు అతడిని చుట్టుముట్టాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆ మంటలను ఆర్పేసి అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. విచారణలో జాదవ్ ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పడం గమనార్హం.