రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. వెల్‌లోకి దూసుకువచ్చి.. నిరసనలు చేసిన ఎంపీలను ఎంత వారించినా వినలేదు. గంట సేపు సభను వాయిదా వేసిన తర్వాత కూడా వారు వెనుకడుగు వేయలేదు. దీంతో వారిపై శుక్రవారం వరకు సస్పెండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఈ రోజు రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఎడతెగకుండా ధర్నా చేశారు. పలుమార్లు వారించినా వారు వినలేదు. గంట సేపు సభను వాయిదా వేశారు. అయినప్పటికీ వారి ఆందోళనలు అలాగే కొనసాగాయి. అనంతరం, 19 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. శుక్రవారం వరకు సమావేశాల నుంచి వారిని సస్పెండ్ చేశారు. అంటే మళ్లీ.. వచ్చే సోమవారం నుంచి వారు సమావేశాల్లో హాజరు కావొచ్చు.
ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. అలాగే, జీఎస్టీని వెనక్కి తీసుకోవాలనే స్లోగన్‌లు ఇచ్చారు. సభలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు ముమ్మరం చేశారు. వీరిని ఉద్దేశించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ విధంగా మాట్లాడారు. స్లోగన్లు చేస్తూ.. వెల్‌లోకి దూసుకొచ్చి ఇక్కడే నిలబడి చప్పట్లు కొడుతూ రభస చేస్తున్న సభ్యులకు తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, ఇది చట్టానికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. దయచేసి వారి వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని కోరారు. దేశమంతా మిమ్మల్ని చూస్తున్నదని, సభ నడవకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
సస్పెండ్ చేసిన ఎంపీల్లో టీఎంసీ నేత సుశ్మితా దేవ్, శాంతాను సేన్, డోలా సేన్, మూసమ్ నూర్, శాంత ఛెత్రి, అభి రంజన్ బిస్వార్, ఎండీ నదీముల్ హక్, ఎం హమామెద్ అబ్దుల్లా, బీ లింగయ్య యాదవ్, ఏఏ రహీం, రవిహంద్ర వడ్డిరాజు, ఎస్ కళ్యాణసుందరం, ఆర్ గిరిరంజన్, ఎన్ఆర్ ఎలాంగో, వీ శివదాసన్, ఎం శన్ముగణ్, దామోదర్ రావు దివకొండ, సందోష్ కుమార్ పీ, కనిమొళి ఎన్‌వీఎన్ సోములు ఉన్నారు.
ఈ సస్పెన్షన్ పై టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియన్ స్పందిస్తూ.. నరేంద్ర మోడీ, అమిత్ షాలు ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్ చేశారని, మీరు ఎంపీల గురించి మాట్లాడుతున్నారా? అని వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఈ సస్పెన్షన్‌లపై బీజేపీ నేత పియూష్ గోయల్ ఈ విధంగా మాట్లాడారు. రాజ్యసభ నుంచి ఎంపీలను సస్పెండ్ చేయాలనే నిర్ణయం బరువైన హృదయంతో తీసుకున్నామని వివరించారు. వారు చైర్మన్ సూచనలను పట్టించుకోనే లేదని తెలిపారు. ప్రభుత్వం ధరల పెంపుపై మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నదని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రికవరై పార్లమెంటుకు తిరిగి వచ్చిన తర్వాత వాటిపై చర్చలు జరుపుతామని, అప్పటి వరకు సమావేశాలను సజావుగా సాగనివ్వాలని చెప్పామని వివరించారు.
పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18వ తేదీన ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల 12వ తేదీన ముగియనున్నాయి. లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఈ సమావేశాల నుంచి మొత్తం సస్పెండ్ చేసిన తర్వాతి రోజే ఈ పరిణామం జరగడం గమనార్హం.
