అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇండో చైనా బార్డర్ పనుల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణాల్లో పని చేస్తున్న 19 మంది కార్మికులు వారం క్రితం నుంచి కనిపించకుండా పోయారు. అందులో ఒకరి మృతదేహం సమీపంలోని కుమీ నదిలో లభించింది. మిగతా వారు కూడా నదిలో మునిగి మరణించి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ఇండో చైనా బార్డర్‌లో రోడ్ వర్క్స్‌లో పని చేస్తున్న 19 మంది కార్మికులు వారం రోజులుగా కనిపించకుండా పోయారు. ఇందులో ఒకరి మృతదేహం కుమీ నదిలో కనిపించింది. మిగతా 18 మంది గురించిన ఆందోళన ఉన్నది. అయితే, వారు కూడా కుమీ నదిలో మునిగి మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కురుంగ్ కుమీ జిల్లాలోని దామిన్‌లో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రోడ్ పనులు చేపడుతున్నది. ఇందులో పని చేస్తున్న 19 మంది ఈద్ వేడుకలు చేసుకోవడానికి కాంట్రాక్టర్‌ను సెలవు అడిగినట్టు తెలిసింది. కానీ, ఆ కాంట్రాక్టర్ సెలవు ఇవ్వలేదు. దీంతో ఎలాగైనా ఈ వేడుకలు చేసుకోవాల్సిందేనని అనుకున్నారు. దీంతో వారు కాలి నడకన ప్రాజెక్ట్ సైట్ వదిలి వెళ్లిపోయారు. వారు కురుంగ్ కుమీ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మిస్ అయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. దామిన్ సర్కిల్‌లో నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులు చైనా సరిహద్దుకు సమీపంలో రిమోట్ ఏరియాలో ఉన్నట్టు సమాచారం.
ప్రాజెక్ట్ సైట్ నుంచి వారం రోజుల క్రితం నుంచి 19 మంది కనిపించకుండా పోయారని డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. ఒకరి డెడ్ బాడీ సమీపంలోని నదిలో లభ్యం అయిందని తెలిపారు. ఒక మృతదేహం లభించినట్టు డిప్యూటీ కమిషనర్ బెంగీ నిఘీ తెలిపారు. కానీ, స్థానికుల కథనం ప్రకారం, మిగితా 18 మంది కూడా దామిన్‌లోని కుమీ నదిలో మునిగి మరణించి ఉండొచ్చని చెబుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, 18 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. రెస్క్యూ టీమ్‌ను పంపించబోతున్నట్టు అధికారి తెలిపారు. కుమీ నదిలోనే అందరూ మరణించారన్న వాదనలను వెరిఫై చేయడానికి వారు రెస్క్యూ పనులు చేయబోతున్నట్టు వివరించారు.
