ఇంట్లో దొంగలు పడితే... మనం ఫస్ట్ చేసే పనేంటి..? పోలీసులకు ఫోన్ చేస్తాం.. లేదంటే పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తాం.. వాళ్లు మన ఇంటిని పరిశీలించి.. దొంగతనం చేసిన తీరును బట్టి.. దొంగలెవరై ఉంటారా ఊహించి.. అసలు దొంగలను పట్టుకుంటారు. అలాంటిది పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడితే... ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాలో ని బైసింగపూర్ పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. పోలీస్ స్టేషన్ కి చాలా తెలివిగా కన్నం వేసి.. రూ.లక్షల విలువచేసే సెల్ ఫోన్ లు ఎత్తుకెళ్లారు. స్టేషన్ లోని స్టోర్ రూమ్ లో ఉంచిన దాదాపు 185 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు.

Also Read ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం, రంగంలోకి 26 ఫైరింజన్లు...

చోరీలు, బెదిరింపులు వంటి కేసుల్లో వీటిని స్వాధీనం చేసుకొని స్టోర్ రూమ్ లో పెట్టామని... గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాయని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. అయితే... ఇది స్టేషన్లో వాళ్ల పని కావొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.