మహారాష్ట్రలో 20 ఏళ్ల దుండగుడు కాలేజీలో చదువుకుంటున్న 18 ఏళ్ల యువతి వెంటపడ్డాడు. తనను ప్రేమించాలని తరుచూ వేధించేవాడు. ఆమె ససేమిరా అనడంతో ఓ రోజు ఆమెను కాలేజీ సమీపంలోనే గొంతు కోసి చంపేశాడు. తనను ఎందుకు ప్రేమించట్లేదని అడిగి మరీ హత్య చేసినట్టు అధికారులు తెలిపారు.
ముంబయి: మహారాష్ట్రలో ఓ దుండగుడు 18 ఏళ్ల యువతి వెంట పడ్డాడు. ప్రేమించాలని పట్టుబడ్డాడు. బెదిరించాడు. కానీ, ఆమె ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ దుండగుడు చివరకు ఉన్మాద నిర్ణయం తీసుకున్నాడు. పక్కా ప్లాన్‌గా ఆ యువతిని పట్టుకుని ‘నన్ను ఎందుకు ప్రేమించవ్?’ అని అడిగాడు. ఆ తర్వాత గొంతు కోసి అంతమొందించాడు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 20 ఏళ్ల శరణ్ సింగ్ సేథి 18 ఏళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్ వెంటపడి తరుచూ వేధించేవాడు. సుఖ్‌ప్రీత్ కౌర్ ఔరంగాబాద్‌లోని దియోగిరి కాలేజీలో బ్యాచిలర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతుండేది. పక్కా ప్లాన్ వేసుకుని శరణ్ సింగ్ సేథి దియోగిరి కాలేజీ సమీపంలోకి వెళ్లాడు. సుఖ్‌ప్రీత్ కౌర్‌ను చూశాడు. ఆమెను దియోగిరి కాలేజీ సమీపంలోనే తనను ఎందుకు ప్రేమించట్లేదని అడిగి గొంతు కోసి చంపేసినట్టు అధికారులు తెలిపారు.
అనంతరం శరణ్ సింగ్ సేథి నాసిక్‌లో లాసల్‌గావ్‌లోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. లాసల్‌గావ్‌లోని శ్రీ గణేష్ నగర్ ఏరియాలోని సోదరి ఇంట్లో శరణ్ సింగ్ సేథిని ఎస్పీ సచిన్ పాటిల్ సారథ్యంలోని బృందం పట్టుకుంది. సుఖ్‌ప్రీత్ కౌర్ మర్డర్‌ను దర్యాప్తు చేస్తున్న వేదాంత్ నగర్ పోలీసు స్టేషన్ అందించిన సమాచారం మేరకు సేథిని అరెస్టు చేసినట్టు నాసిక్ రూరల్ పోలీసు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఇటీవలే హైదరాబాద్‌లో పరువు హత్య జరిగింది. బేగంబజార్ కోల్సావాడి ప్రాంతానికి చెందిన నీరజ్ పన్వర్ పల్లీల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన సంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నెల క్రితం బాబు పుట్టాడు. అయితే సంజనను పెళ్లి చేసుకన్న నీరజ్‌పై ఆమె కుటుంబ సభ్యుల కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే సంజన సోదరులు, వారి స్నేహితులు.. నీరజ్ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నీరజ్ మృతిచెందాడు.
