దేశంలో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడం మాత్రమే మార్గమని అందరూ చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ కూడా జరుగుతోంది. అయితే.. చాలా ప్రాంతాల్లో కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులో లేదని.. అందరికీ కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేస్తున్నారు. కోవ్యాగ్జిన్ కొరతపై పలు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ వార్తలపై భారత్ బయోటెక్ స్పందించింది. తమ వ్యాక్సిన్ అందుబాటులోనే ఉందని పేర్కొంది.

మే 1వ తేదీ నుంచి దేశంలోని దాదాపు 18 రాష్ట్రాలకు డైరెక్ట్ గా కో వ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నట్లు భారత్ బయెటిక్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, బిహార్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కో వ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.

18 రాష్ట్రాలకు తాము కో వ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నామని.. తాము కంటిన్యూస్ గా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామంటూ భారత్ బయోటిక్ తమ అధికారిక ట్విట్టర్ లో తెలియజేసింది. 

తాము.. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏప్రిల్ 29 న, భారత్ బయోటెక్ రాష్ట్రాల కోవాక్సిన్ ధరను మునుపటి రూ.600 నుండి రూ.400లకు తగ్గించినట్లు ప్రకటించింది. ఇది కోవాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ.150కే అందిస్తోంది. ఈ నేపథ్యంలో.. విమర్శలు కూడా వచ్చాయి.