ఇంటి ముందు మూత్రం పోసారని ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం  శివ్ పురి జల్లాకు చెందిన గ్రామపెద్దలు ఇద్దరు చిన్నారులను కొట్టి చంపిన సంఘటన తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఇలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇదే కారణంతో 18నెలల చిన్నారిని అతి కిరాతకంగా కొట్టి చంపారు. ఈ సంఘటన కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా, భాగస్ పూర్ గ్రామంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన రామ్ సింగ్ కి 18 నెలల వయసుగల కుమారుడు ఉన్నాడు. ఇటీవల బాలుడు ఆడుకుంటూ పక్కనే ఉన్న మోహర్ సింగ్ అనే వ్యక్తి  ఇంటి పరిసరాల్లోకి వెళ్లి మల, మూత్ర మిసర్జన చేశాడు. దీంతో మోహర్ సింగ్, అతని కుమారుడు ఉమేష్.. బాలుడిపై కోపంతో ఊగిపోయారు.

బాలుడు తండ్రి రామ్ సింగ్ తో గొడవపడ్డారు. కర్రలతో దాడి కూడా చేశారు. ఈ క్రమంలో బాలుడిని కూడా కర్రలతో కొట్టడం గమనార్హం. దీంతో బాలుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అప్పటికే మృతి చెందాడు. బాలుడి తండ్రి రామ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.