ఆ అమ్మాయి అప్పటికే  మరొకరికి మనసు ఇచ్చింది. ఈ విషయం పట్టించుకోని పేరెంట్స్.. బలవంతంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు. ఇంట్లోవారి కోసం ఆమె కూడా పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకుంది. అయితే.. తాళి అయితే కట్టించుకుంది కానీ..  కాపురం మాత్రం చేయలేకపోయింది.

తన మనసు ప్రియుడి దగ్గరే ఉందని అర్థం చేసుకుంది. అంతే.. పెళ్లైన 18 రోజులకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తాను ప్రేమించిన ప్రియుడి వద్దకు పారిపోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ కి చెందిన మూర్తి రైక్వార్ అనే 20ఏళ్ల యువతికి డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ కి చెందిన రాహుల్ అనే వ్యక్తితో వివాహమైంది. కానీ అప్పటికే ఆమె భజ్జు యాదవ్‌ అనే అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో ఉంది. పెళ్లయినా కూడా అతడి తలపుల్లో నుంచి బయటకు రాలేకపోయింది. మరోవైపు పెళ్లి తర్వాత జరిగే తంతు కోసం నూతన వధువు పుట్టింటికి పంపించారు.

అక్కడ అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఆమె డిసెంబర్‌ 24న మెట్టినింటికి తిరుగు పయనమైంది. ఇక దొరికిందే ఛాన్సని భావించిన సదరు యువతి తన మెడలో మూడు ముళ్లు పడ్డాయన్న విషయాన్ని మర్చిపోయి ప్రియుడితో పరారైంది. లక్షలు ఖరీదు చేసే బంగారు నగలు, డబ్బును కూడా వెంటపెట్టుకుని ఉడాయించింది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మరోవైపు తన భార్య దారిలోనే ఎవరితోనే జంప్‌ అయిందని తెలుసుకున్న భర్త అమ్మాయి ఇంటికి వెళ్లి నానా రభస చేశాడట. ఈ విషయం గురించి వధువు తండ్రి రామ్‌పాల్‌ మాట్లాడుతూ.. కూతురు కోసం అల్లుడు గాలిస్తున్నాడని తెలిపాడు. ఆమె రూ.5 లక్షలు విలువ చేసే నగలతో పాటు, రూ.20 వేలు పట్టుకెళ్లిందని పేర్కొన్నాడు.