గ్రామాల్లో ఆవులు, గేదేలు, కోళ్లను ఎత్తుకుపోవడం చూస్తూ ఉంటాం.. అది కూడా ఒకటో రెండో.. అలాంటిది ఏకంగా 25 మంది దొంగలు వచ్చి కణతలకు తుపాకీ గురిపెట్టి 18 బర్రెలను ఎత్తుకెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ వెరైటీ దొంగతనం జరిగింది.

రత్నపురి గ్రామానికి చెందిన నరేశ్ కుమార్, మోహిత్ ఇవాళ ఉదయం తమ పశువుల కొట్టంలో బర్రెలకు కాపలా ఉన్నారు. ఈ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో ఏమో కానీ 25 మంది దుండగులు అక్కడికి వచ్చి నరేశ్, అతని కుమారుడిని తుపాకులతో బెదిరించారు.

అనంతరం రూ.20 లక్షలు విలువ చేసే 18 బర్రెలను రెండు లారీల్లో ఎత్తుకుపోయారు. వీటితో పాటు నరేశ్, మోహిత్‌ల మొబైల్స్, ఒక బైకును కూడా దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి.. బర్రెలను ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.