గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దక్షిణ భారతదేశం అతలాకుతలమౌతోంది. కేరళ, కర్ణాటకలతోపాటు.. మహారాష్ట్రను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటికే 179మంది మృతి చెందారు. మరో 70మంది వరదల్లో కొట్టకుపోయారు. వారి ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 

ఎక్కువగా కేరళలో 88మంది మృతి చెందగా... కర్ణాటకలో 48మంది, మహారాష్ట్రలో 43మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో వరదలు భారీగా రావడంతో.. మృతుల సంఖ్య భారీగా పెరగగా... మిగిలిన రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగి పడటం కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని  అధికారులు చెబతుున్నారు. 

కేరళలో వరద బాధితులను రక్షించేందుకు ఇప్పటి వరకు అధికారులు 1332 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఆకాశం మేఘావృతమై ఉందని.. మరో ఐదు రోజుల పాటు వరసగా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరసగా మరో ఐదు రోజులు వర్షం పడితే... వరదలు మరింత ఉధృతంగా పొంగి పొర్లే ప్రమాదం ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మంత్రులు, సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. వరద బాధితులను రక్షించేందుకు చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఇక కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 48మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 6.73లక్షల మందిని, 50వేల జంతువులను అధికారులు రక్షించారు. 3,93,956మందిని 1224 సురక్షిత కేంద్రాలకు తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని 17జిల్లాల్లో  2738 గ్రామాలు, 86తాలుకాలు వరద ప్రభావానికి గురైనట్లు గుర్తించారు.

 భారీ వరదలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా 136 జాతీయ, రాష్ట్ర రహదారులతో సంబంధాలు తెగిపోయినట్లు చెబుతున్నారు. పూణే- బెంగళూరు జాతీయ రహదారి4 ని పూర్తిగా మూసివేశారు. కర్ణాటక రాష్ట్ర పరిస్థితి అస్సలు బాలేదని.. సంక్షేమం కింద కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.పదివేల కోట్లు విడుదల చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప కోరారు. ఈ మేరకు ఆయన హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కోరారు. ఈ విషయంలో తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నట్లు కూడా ఆయన చెప్పారు.

ఇక మహారాష్ట్రలో 43మంది ప్రాణాలు కోల్పోగా... ముగ్గురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 4,08,322మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి అధికారులు చెప్పారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 1224 సురక్షిత కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం  372 మెడికల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.