1900లో అప్పటి భారత ప్రభుత్వం గల్ప్ లో చిక్కుకున్న 1,70,000 భారతీయులను ఎలాంటి హడావిడి లేకుండా విజయవంతంగా తీసుకొచ్చిందని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తెలిపారు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఉక్రెయిన్ లో చాలా తక్కువ మంది చిక్కుకున్నారని తెలిపారు. వారిని ఇక్కడికి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను తరలించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని తృణముల్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఆరోపించారు. 1990 ఆగస్టు, అక్టోబర్ మధ్య 1,70,000 మందిని కువైట్ నుంచి ఇండియాకు అప్పటి ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్ దీనిని పర్యవేక్షించారని ఆయన ఎత్తి చూపారు. అది విజయవంతం అయ్యిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల సంఖ్య దాదాపు 18,000 మంది మాత్రమేనని అంచనా వేశారు. భారత్ గతంలో చేసిన ఎయిర్‌లిఫ్ట్‌లతో పోలిస్తే ఇది చాలా పెద్ద సంఖ్య కాదు అని అన్నారు.
యూపీలో ఇంకా ఎన్నికలు జరుగుతున్నాయనీ యశ్వంత్ సిన్హా అన్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం విద్యార్థుల తరలింపు విషయాన్ని గొప్పగా చెప్పుకోవడం సరికాదని అన్నారు. ఇది ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పారు. సంక్షోభం రాబోతోందని అందరికీ తెలుసుని, అయితే ఉక్రెయిన్ గగనతలంపై ఆంక్షలు లేని సమయంలోనే ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్లను తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సిందని ఆయన చెప్పారు.
ఉక్రెయిన్ లో గగనతలం మూసివేసిన తర్వాత కూడా ఇండియన్ ఎంబసీ ద్వారా విద్యార్థులను బస్సులో వెంటనే పొరుగు దేశాలకు తరలించి, అక్కడ అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆకస్మిక ప్రణాళిక సిద్ధం చేసి ఉండాల్సిందని చెప్పారు. ప్రస్తుతం నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిందనీ, కానీ ఇది ముందుగానే చేస్తే బాగుండేదని అన్నారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల పట్ల అక్కడి అధికారులు అసభ్యంగా ప్రవర్తించడం విషయంలో సిన్హా మాట్లాడుతూ.. సంక్షోభం పట్ల భారత్ ద్వంద వైఖరి కారణంగానే అక్కడి అధికారులు మన దేశానికి పెద్దగా సహాయం చేయడం లేదని తనకు సమాచారం అందిందని తెలిపారు. ఉక్రెయిన్ అధికారులు సహకరించకపోవడానికి కారణం ఇదే అని చెప్పారు.
గత రోజులుగా రొమేనియా, పోలాండ్ సరిహద్దులలో భారతీయ విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు వస్తున్నాయి. మైళ్ల దూరం ప్రయాణించి సరిహద్దుకు చేరుకున్నప్పుడు, ఎముకలు కొరికే చలిలో కాలినడకన వెళ్లే సమయంలో చాలా మందిని కొట్టారని, వారిని దాటనివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. అందులో ఒక రోజు కంటే ఎక్కువగానే ఆహారం, నీరు లేకుండా ఉంటున్నామని, నీరసం, ఒత్తిడితో తమ స్నేహితులు కుప్పు కూలుతున్నారని పలు విద్యార్థులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దాటే సమయంలో గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారని వారు చెప్పారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థి తమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. ఓ వీడియోను ట్వీట్ చేశారు. ‘‘ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి మరింత దిగజారుతోంది. అయినప్పటికీ వారిని స్వదేశానికి తీసుకురావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదు. ’’ అని ఆయన పేర్కొన్నారు.
