కొత్త డ్రస్సు కొనుక్కుందనే అక్కసుతో ఓ తమ్ముడు సొంత అక్కపై దాడి చేసి ఆమె కళ్లు పీకేసి గదిలో నిర్బంధించాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బాధితురాలు, తన తమ్ముడు, చెల్లెళ్లతో కలిసి ఢిల్లీలోని ద్వారక సమీపంలో నివసిస్తోంది.

ఈ క్రమంలో తనకు తెలియకుండా అక్క రూ. 100 విలువైన కొత్త డ్రస్సు కొనుక్కుందున్న కోపంతో తమ్ముడు ఆమెపై దాడి చేసి కనుగుడ్లను పీకేసేందుకు ప్రయత్నించాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను గదిలో బంధించి తాళం వేశాడు.

ఢిల్లీ మహిళా కమీషన్ సభ్యులు మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఈ విషయాన్ని స్థానికులు వారి దృష్టికి తీసుకురావడంతో ఈ అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది.

బాధితురాలిని రక్షించేందుకు వెళ్లిన అధికారులతో సైతం బాలుడు ఘర్షణకు దిగాడు. దీంతో కమీషన్ సభ్యులు పోలీసుల సాయంతో తాళాలు పగులగొట్టి తీవ్ర రక్తస్రావంతో నేలపై పడివున్న యువతిని చికిత్స నిమిత్తం సఫ్దర్‌గంజ్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై ఢిల్లీ మహిళా కమీషన్ సభ్యురాలు స్వాతి మలివాల్ స్పందిస్తూ.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన బాలుడిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు.

సదరు బాలుడు గతంలో కూడా అక్కాచెల్లెళ్లపై దాడి చేసి తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు స్థానికులు తమతో చెప్పినట్లుగా స్వాతి పేర్కొన్నారు.