బర్మేర్: రాజస్థాన్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గాలివానకు, భారీ వర్షానికి బర్మేరులో టెంట్ కూలి 14 మంది మరణించగా, 70 మంది దాకా గాయపడ్డారు. గాయపడిన 70 మందిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని బాలోత్రలోని నహతా ఆస్పత్రికి తరలించారు. వారిని మెరుగైన చికిత్స కోసం జైపూర్ కు తరలించనున్నారు. 

బర్మేర్ జిల్లాలోని జాసోల్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుింది. మతపరమైన సంబరాల సందర్భంగా ప్రజలు అక్కడికి వచ్చారు. టెంట్ కూలి మీద పడింది. అయితే, విద్యుత్ షాక్ తో ఎక్కువ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. 

 

పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులకు ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

దురదృష్టకరమైన సంఘటనగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభివర్ణించారు. ఈ సంఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు .బాధితులకు, వారి కుటుంబాలకు తగిన సాయం అందిస్తామని చెప్పారు.