రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. 16ఏళ్ల మైనర్ బాలిక ఇంట్లో  ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తండ్రి చెప్పడం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్పూర్ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ  ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

దోల్పూర్ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక (16) రాత్రి పూట ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు  బంటీ(23), హర్కీష్(20) లు ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక బాలిక ఇంట్లో ఉరివేసుకుంది. కాగా.. తమ కూతురి చావుకి ఈ ఇద్దరు యువకులే కారణమంటూ ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సోమవారం పోలీసులు బాలిక శవానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 

కాగా.. బాలికకు నిందితుల్లో ఒకడైన బంటి తో గతంలో పరిచయం ఉందని.. ఈ క్రమంలోనే ఆ సమయంలో కలవడానికి వచ్చారని తెలుస్తోంది. తన స్నేహితుడు హర్కీష్ తో కలిసి వచ్చిన బంటి.. బాలికపై దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.