జార్ఖండ్‌లో అధికార పార్టీ జేఎంఎంతో 16 మంది బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారని జేఎంఎం పార్టీ నేత సుప్రియో భట్టాచార్య అన్నారు. వారు హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు.
రాంచీ: జార్ఖండ్ అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా సంచలన వ్యాఖ్యలు చేసింది. 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా మొదలైంది. అటు జేఎంఎం, ఇటు బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
తమతో 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని జేఎంఎం నేత సుప్రియో భట్టాచార్య అన్నారు. వారంతా హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. బీజేపీలో వారంతా ఊపిరాడనట్టుగా కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. అందుకే వారంత ఒక చీలికలా ఏర్పడి.. ఓక కూటమిగా ఏర్పడి జేఎంఎం సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలపాలని భావిస్తున్నారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగానే ఉన్నదా? అంటూ ఆయనను విలేకరులు అడిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షిస్తున్నట్టుగా తెలుస్తున్నదని జేఎంఎం నేత ముందు ప్రస్తావించారు. దీనికి సమాధానం చెబుతూ.. తమ ప్రభుత్వానికి వచ్చిన ఆటంకమేమీ లేదని, ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించడం పై మాట్లాడుతూ, ఇలాంటి వదంతులపై తాము నిర్ణయాలు తీసుకోలేమని తెలిపారు. వారు ప్రతిపాదనతో వస్తే కదా.. అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అని వివరించారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దర్యాప్తు ఏజెన్సీ లెన్స్ కింద ఉన్నారు. అక్రమ మైనింగ్‌లో ఆయన పేరూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.
కాగా, బీజేపీలో తిరుగుబాటు గురించి ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ ప్రతినిధి ప్రతుల్ ష హదేవ్ మాట్లాడారు. జేఎంఎం వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తమ పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశమే లేదని పేర్కొన్నారు. జేఎంఎం మోకాళ్ల లోతు అవినీతిలో కూరుకుపోయిందని తెలిపారు. తమ ఉనికిని కాపాడు కోవడానికి వారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే, ఈ తాజా డ్రామా అని ఆరోపించారు. అవినీతి మయ మైన ప్రభుత్వం ఇప్పుడు తమను తాము రక్షించుకోవడానికి చివరి అవకాశంగా కనిపిస్తున్నతప్పుడు అభిప్రాయాలను ప్రచారంలోకి తెస్తున్నారని వివరించారు.
