మధ్యప్రదేశ్ రాష్ట్రంలో  ఘోర రోడ్డు ప్రమాదం చోటు  చేసుకుంది.ఈ ప్రమాదంలో  22 మంది మృతి చెందారు.  

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఖార్గోన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శ్రీఖండి నుండి ఇండోర్ వెళ్తున్న బస్సు బోరాడ్ నది వంతెన రెయిలింగ్ ను ఢీకొని నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయలో బస్సులో 70 మంది ప్రయాణీకులున్నారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదస్థలానికి జిల్లా కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బోరాడ్ నదిపై 50 అడుగుల ఎత్తులో వంతెన నిర్మించారు. ఈ వంతెనపై నుండి వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వేసవి కాలం కావడంతో బోరాడ్ నది ఎండిపోయింది. బస్సు నదిలో పడిపోవడంతో బస్సులోని 22 మంది మృతి చెందారు.మరో 20 మంది గాయపడ్డారు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు పరిహారం అందించనున్నట్టుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 

 దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన యూపీలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. హర్దోయ్ ప్రాంతానికి చెందిన వారంతా వ్యాన్ లో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ నెల 4వ తేదీన తమిళనాడులోని మహాబలిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బస్సు, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 4వ తేదీన ఛత్తీస్ ఘడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. బొలేరో వాహనం, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మరో వైపు బీహార్ రాష్ట్రంలో ని సీతామర్తిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన ఈ నెల 4న చోటు చేసుకుంది.