పవిత్ర స్నానాలకు వెళ్తుండగా అపశృతి.. చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి 15 మంది మృతి..
ఓ ట్రాక్టర్ ట్రాలీతో సహా చెరువులో బోల్తా పడటంతో 15 మంది మరణించారు. ఈ ఘటన యూపీలోని కాస్ గంజ్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. కాస్ గంజ్ జిల్లాలో ఓ ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదిలో పవిత్ర స్నానానికి మహిళలు, పిల్లలు కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో 8 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారని అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథుర్ ‘హిందుస్థాన్ టైమ్స్’తో తెలిపారు. రోడ్డుపై కారును ఢీకొనకుండా తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ డ్రైవర్ కంట్రోల్ కోల్పోయారని మాథుర్ తెలిపారు.
దీంతో బురద నీటితో నిండిన చెరువులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర, తగిన చికిత్స అందేలా చూడాలని కాస్ గంజ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.