లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఉత్తరప్రదేశ్ లోని 14 రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలకు 15 మంది మరణించారు. దాదాపు 133 భవనాలు కూలిపోయాయి. 

అధికారిక లెక్కల ప్రకారం... గత నాలుగు రోజులుగా వర్షం వల్ల 15 మంది మరణించారు. 23 పశువులు మరణించాయి. 133 భవనాలు కూలిపోయాయి. జులై 9 నుంచి 12వ తేదీ వరకు కురిసిన వర్షాలకు ఆ విధ్వంసం జరిగిందని అధికారులు చెప్పారు. 

వర్షాల ప్రభావం యుపిలోని ఉన్నావ్, అంబేడ్కర్ నగర్, ప్రయాగ్ రాజ్, బారాబంకి, హర్దోల్, ఖిరి, గోరక్ పూర్, కాన్పూర్ నగర్, పిలిభిత్, సోనాభద్ర, ఫిరోజాబాద్, మవు, సుల్తాన్ పూర్ జిల్లాల్లో భారీగా కనిపించింది.

శనివారంనాడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధక కార్యాలయం తెలియజేస్తోంది. లక్నోలో వచ్చే ఐదు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటోంది.