ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి ఇంట్లోనుంచి పారిపోయింది. ఆ తరువాత తననెవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసుల దగ్గరికి వెళ్లింది. తీరా సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. 

ముంబై : చదువుకోమని తల్లి మందలించడంతో 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. నాగపూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్ కు వెళ్లిన బాలిక తనను కిడ్నాప్ కు గురయ్యారని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపెట్టింది. ఈ కేసు వివరాలను ఆదివారం పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగపూర్ జిల్లాలోని నందన్ వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్ కు సాయంత్రానికి చేరుకుంది. అయితే, ఇంట్లో కూతురుకనిపించకపోవడంతో.. తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. తెలిసిన వారందరినీ, స్నేహితులను, బంధువులను ఆరా తీశారు. అయినా ఆమె గురించి తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిమీద మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 

ఆఫ్ఘనిస్తాన్‌ మహిళకు బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపే శిక్ష.. ముందే ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు

మరోవైపు.. చంద్రపూర్ చేరుకున్న బాలిక నేరుగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి కారులో చంద్రాపూర్ కు తీసుకు వచ్చినట్లు చెప్పింది. వారి నుంచి ఎలాగో తప్పించుకుని.. పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు కట్టుకథ అల్లింది. అది నమ్మిన పోలీసులు బాలిక దగ్గర వివరాలు సేకరించారు. ఆమె తెలిపిన వివరాలతో నాగపూర్లోని కుటుంబ సభ్యులకు చంద్రాపూర్ పోలీసులు సమాచారం అందించారు.

విషయం తెలిసిన వెంటనే...చంద్రాపూర్ చేరుకున్న తల్లిదండ్రులకు ఆమెను అప్పజెప్పారు. దీనిమీద నాగపూర్లోని నందన్ వన్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా… బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోని చూపించి బాలికను గట్టిగా ప్రశ్నించారు పోలీసులు. దీంతో భయపడిపోయిన బాలిక తన తల్లి చదువుకోవాలని మందలించడంతో తప్పించుకోవాలని తానే అలా చేశానని అంగీకరించింది.