పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లిన ఓ మైనర్ ను దుండగులు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను పైశాచికంగా కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి పారిపోాయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది.
మహిళలపై దాడులు ఆగడం లేదు. వారి రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట వారిపై దాడి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు కూడా చూడకుండా వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూపీలో 14 ఏళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలికపై తన సమీపంలో ఉన్న పశువులకు మేత వేస్తోంది. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆమెను అపహరించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లి తమ కూతురు గంటలు గడిచినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. గ్రామంలో మొత్తం వెతికారు. అయినా కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే గ్రామ సమీపంలోని పొదల్లో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉందని బాధితురాలి బంధువుల్లో ఒకరికి సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూస్తే ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెను దుండగులు తాడుతో కట్టేసి, నోట్లో గుడ్డపెట్టేశారు. దీంతో ఆమె నోరు మూసుకుపోయింది. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బృందం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టింది. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించింది.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని కాన్పూర్ దేహత్ దేరాపూర్ సర్కిల్ అధికారి శివ్ ఠాకూర్ తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందుతులను చుట్కాన్, బద్కన్ గా గుర్తించామని, వారిద్దరు సోదరులని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ప్రారంభంలో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చోసుకుంది. ఓ కాలేజీ యువతిని కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మీరట్‌లోని సర్ధానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహిళ ప్రతీ రోజూ ఖటోలీలో ఉండే కాలేజీకి వెళ్లి చదువుకుంటుంది. రోజులాగే కాలేజీకి వెళ్లిన యువతిని ఓ ఐదుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. ఆమెను అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించారు. ఢిల్లీకి వెళ్తున్న క్రమంలోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బెదిరించారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని హెచ్చరించారు. అనంతరం బాధిత యువతిని వారు మీరట్ కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. కాగా కాలేజీకి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి తెలియజేసింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
