జమ్మూకశ్మీర్ లో భారత జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య.. 18గంటలపాటు భీకర పోరు జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో.. ముగ్గురు ఉగ్రవాదులు హతమవ్వగా వారిలో.. ఓ 14ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా.. నలుగురు సెక్యురిటీ సిబ్బంది, ముగ్గురు పౌరులు గాయాలపాలయ్యారు. 

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. ఆదివారం తెల్లవారుజామున భారత ఆర్మీ దాడులకుపాల్పడింది. మృతులు ముదసిర్ రషీద్ పర్రాయ్(14), సాకిబ్ ముస్తక్, అలాబాయ్ లు గా గుర్తించారు. 

హజీన్ పట్టణానికి చెంది ముదసిర్ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.  కొద్ది నెలల క్రితం పాఠశాలకు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ముదసిర్.. తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా.. ఆచూకీ లభించలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా.. గత నెల రోజు క్రితం ముదసిర్.. ఏకే47 తుపాకీ పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించగా.. అతను బతికే ఉన్నాడనే విషయం తెలిసింది.

ఉగ్రవాదానికి ఆకర్షితుడై.. అందులో చేరినట్లు పోలీసులు  గుర్తించారు. ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు ఆ బాలుడిపై లేదు. కాగా.. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు.