ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత కల్పించిన 14 మంది  పంజాబ్ పోలీసులను సత్కరించింది ఆ రాష్ట్ర పోలీస్ శాఖ. వీరందరికీ ‘డీజీపీ ప్రశంసా పురస్కారం’ అందజేశారు ఆ రాష్ట్ర డీజీపీ.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (punjab assembly elections) సమయంలో ప్రచారానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) సెక్యూరిటీ లోపం కారణంగా (punjab security breach) వెనక్కి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతేకాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. అయితే ఆరోజున ప్రధాని నరేంద్రమోదీకి భద్రత కల్పించిన 14 మంది పంజాబ్ పోలీసులకు (punjab police) ‘డీజీపీ ప్రశంసా పురస్కారం’ లభించింది. నాటి ఘటనలో రైతు నిరసనల కారణంగా మోదీ కాన్వాయ్ ముందుకు కదలలేకపోయింది. ఆ సమయంలో ప్రధానికి, ఆయన వ్యక్తిగత సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంజాబ్‌కు చెందిన కొంతమంది పోలీసులు రక్షణ కల్పించారు. 

ఈ క్రమంలో మార్చి 26 పంజాబ్ డీజీపీ వీకే భవ్రా ఈ ప్రకటన చేశారు. మొత్తం 14 మంది పంజాబ్ పోలీసులు ఈ అవార్డు అందుకున్నారు. హర్షర్డే నింబ్లే, హరిష్ ఓం ప్రకాష్, రాజ్‌పాల్ సింగ్ సంధు, ఓపిందర్‌జిత్ సింగ్ ఘుమాన్, సతిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, జగ్మోహన్ సింగ్‌, సింగ్ ఖాఖ్, జస్కత్రాంజిత్ సింగ్ తేజ, రాజేశ్వర్ సింగ్ సిద్ధు, మంజీత్ దేశి, సుహేల్ ఖాసిమ్ మిర్, రాకేష్ యాదవ్, వివే చందర్‌లు డీజీపీ ప్రశంసా పత్రం అందుకున్నారు.

కాగా...పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 5న భటిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్‌లోని హుస్సేనీవాలాలో ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. దీంతో దాదాపు 20 నిమిషాలు విమానాశ్రయంలోనే ప్రధాని వేచి చూశారు. వాతావరణం మెరుగుపడకపోవడంతో.. రోడ్డు మార్గంలోనే హుస్సేనీవాలాకు వెళ్లాలని మోడీ నిర్ణయించుకున్నారు. ప్రధాని భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని పంజాబ్‌ పోలీసులకు అందించారు. 

దీనిపై స్పందించిన పంజాబ్ డీజీపీ.. రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి సంబంధించిన అనుమతులు రావడంతో ప్రధాని భటిండా ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరారు. గమ్యస్థానం మరో 30 నిమిషాల్లో సమీపిస్తుందనగా.. మోడీ కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో గానీ 100 మంది రైతులు ఆ రహదారిని దిగ్బంధించారు. దీంతో కారులోనే ప్రధాని కాసేపు వేచిచూశారు. ఎంతకీ పరిస్థితి మెరుగుపడక ప్రధాని తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ చేరుకున్నారు.