ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో (Champawat district) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఓ వాహనం లోయలో పడిపోయిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో (Champawat district) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఓ వాహనం లోయలో పడిపోయిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ ప్రాంతంలోని సుఖిధాంగ్-దండమినార్-రీతా సాహిబ్ లింక్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 11 మంది మరణించినట్టుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. బాధితులు వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని Kumaon DIG నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చేపట్టారు. లోయలో పడిపోయిన వాహనం నుంచి మృతదేహాలను వెలికితీయడం మొదలుపెట్టారు. స్థానిక పోలీసులతో పాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సహాయక చర్య కోసం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.
చంపావత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 16 మంది తనక్‌పూర్‌లో ఒక వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులు చంపావత్ జిల్లాలోని కక్నాయికి చెందిన దండా, కతౌటి గ్రామాలకు చెందినవారు. ‘సుఖిదంద్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 11 మరణాలు నిర్ధారించబడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది’ అని చంపావత్ ఎస్పీ దేవేంద్ర పిచా చంపావత్ తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయాన్ని కలచివేస్తోందని పేర్కొన్నారు. ఇందులో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక అధికారులు రెస్క్యూ పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు.
