Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత్.. ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన మరో 133 మంది తెలుగు విద్యార్థులు ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత్.. ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఇప్పటికే వేల మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన మరో 133 మంది తెలుగు విద్యార్థులు ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో 105 మంది విద్యార్థులు తెలంగాణకు చెందిన వారు కాగా, మితగా వారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ఉన్నారు. మొదట వీరందరూ ఉక్రెయిన్ సరిహద్దు పొరుగు దేశాలకు చేరుకున్నారు. అనంతరం ఉక్రెయిన్‌లోని వివిధ పొరుగు దేశాల నుంచి ఆపరేషన్ గంగాలో భాగంగా నడుపుతున్న విమానాల ద్వారా దేశరాజధాని ఢిల్లీకి వచ్చారు.
విద్యార్థులను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు తీసుకురాగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారికి భోజనం, ఇతర ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ విద్యార్థులతో ముచ్చటించారు. తాజా బ్యాచ్‌తో ఉక్రెయిన్ నుంచి తరలించిన తెలంగాణ విద్యార్థుల సంఖ్య 595కు చేరగా.. శనివారం 109 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 మంది విద్యార్థుల బ్యాచ్ కూడా ఆదివారం ముంబైలో దిగింది. దీంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థుల సంఖ్య 457కి చేరింది. ముంబై, ఢిల్లీకి వచ్చే విద్యార్థులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు వంటి వివిధ విమానాశ్రయాలకు వారి ఇష్టానుసారం ప్రయాణించి అక్కడి నుంచి బస్సులు లేదా రైళ్లలో వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో ఫిబ్రవరి 26న భారత పౌరుల తరలింపు ప్రారంభమైంది. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విమానాల ద్వారా వచ్చారు. బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరీ), ర్జెస్జో (పోలాండ్), కోసీస్ (స్లోవేకియా) మరియు సుసెవా (రొమేనియా) నుండి విమానాలు బయలుదేరాయి. కాగా, ఆదివారం భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. నేడు ఆపరేషన్ గంగా చివరిదశ ప్రారంభం అవుతుందనీ, ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులు బుడాపెస్ట్ కు చేరుకోవాలనీ, తమ వివరాలను అందించాలని గూగుల్ ఫారమ్ ను అందుబాటులో ఉంచింది భారత రాయబార కార్యాలయం. ఆదివారం నాడు కూడా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత పౌరులను ప్రత్యేక విమానాల్లో ప్రభుత్వం స్వదేశానికి తీసుకు వచ్చింది.
ఇదిలావుండగా, అంతకు ముందు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం నాడు భారత పౌరులను తరలించే ఆపరేషన్ గంగా చివరి దశను ప్రారంభించింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారర పౌరులు తాము ఉంటున్న నివాసాలను వదిలి వెంటనే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు హంగేరియన్ రాజధాని బుడాపెస్ట్‌లోని హంగేరియా సిటీ సెంటర్‌కు చేరుకోవాలని కోరింది.
