ఛత్తీస్ ఘర్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 13యేళ్ల నిరుపేద బాలికకు పది రూపాయలు ఇస్తానని ఆశచూసి 76, 47యేళ్ల ఇద్దరు వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరికి 76 యేళ్లు.. కాగా మరొకరికి 47 యేళ్లు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిరుపేద బాలికకు పదిరూపాయలు ఇస్తానని మభ్యపెట్టి వీరిద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. 

అయితే, చిన్నారికి తీవ్రమైన కడుపునొప్పి రావడం, ఆ ఇద్దరి దగ్గరికి చిన్నారి వెళ్లడం చూసిన పక్కింటామె అనుమానంతో ప్రశ్నించగా దారుణం బయటపడింది. దీంతో చిన్నారి ప్రాణాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఆమె పరిస్తితి ప్రస్తుతం ఆందోళన కరంగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ హేయమైన ఘటన వివరాల్లోకి వెడితే.. 

రాయ్ పూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఈ దారుణం జరిగింది. బాలిక తల్లిదండ్రులు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తారు. బాలిక తల్లిదండ్రులతో పాటు చిన్న గుడిసెలో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు పనికోసం వెళ్లిన సమయంలో 76 ఏళ్ల కుంజ్రామ్ వర్మ ఆమె ఒంటరిగా ఉండడం చూశాడు. మెల్లిగా ఆమెను దగ్గరికి పిలిచి రూ.10 ఇస్తానని ఆశ చూపెట్టాడు. దానికోసం తన ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ ఆ చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. వెళ్లేప్పుడు పది రూపాయలు చేతిలో పెట్టాడు.

మూడు సార్లు అమ్మేశారు.. ఎన్నోసార్లు రేప్ చేశారు.. బెంగాల్ మహిళపై అరాచకాలు

ఆ తరువాత రోజూ బాలికను పిలిపించుకోవడం.. అత్యాచారం చేయడం.. పదిరూపాయలు చేతిలో పెట్టడం చేసేవాడు. ఇలా కొన్నిరోజులు గడిచాయి. ఒకరోజు కుంజ్రామ్ వర్మ స్నేహితుల్లో ఒకడైన రమేష్ వర్మకు విషయం తెలిసింది. దీంతో అతను కూడా ఆమెపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. కుంజ్రామ్ వర్మలాగే.. అత్యాచారం తరువాత ఆమెకు రూ.10 ఇచ్చేవాడు.

ఇదిలా జరుగుతుంటే.. ఒకరోజు, కుంజ్రామ్ ఇంటి నుండి చిన్నారి బయటకు రావడం ఒక మహిళ చూసింది. మొదట్లో అదేమీ తప్పుగా అనుకోలేదు. కానీ, మరుసటి రోజు రమేష్ ఇంటి నుంచి బయటకు వస్తున్న 13 ఏళ్ల చిన్నారిని చూసింది. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఏదో తప్పు జరుగుతోందని అనిపించింది ఆమెకు. వెంటనే బాలిక దగ్గరికి వెళ్లి విషయం ఆరా తీసింది. అయితే, బాలిక మొదట చెప్పడానికి భయపడింది. ఆ తరువాత తనకు ఎదురైన ఘోరాన్ని బయటపెట్టింది. అంతేకాదు తనకు పొట్టలో తీవ్ర నొప్పిగా ఉందని చెప్పింది. 

అది విని షాక్ అయిన మహిళ.. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వారు గత శనివారం అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిందంతా బాలిక ద్వారా తెలుసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బాలికను వైద్య పరీక్షల కోసం పంపారు, అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితులిద్దరినీ ఆదివారం అరెస్టు చేశారు. వారు తాము చేసి నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గోప్యతను కాపాడే క్రమంలో ఆమె గుర్తింపు బహిర్గతం చేయబడలేదు)