దేశంలో రోజు రోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రం సింధి జిల్లాలో ఓ మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడగా తాజాగా.. మరో దారుణం వెలుగుచూసింది. 13ఏళ్ల మైనర్ బాలికపై తొమ్మిది మంది వ్యక్తులు కేవలం ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 13ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 4వ తేదీన అపహరణకు గురైంది. తెలిసిన వ్యక్తే ఆమెను కిడ్నాప్ చేయడం గమనార్హం. అనంతరం అతనితోపాటు మరో ఆరుగురు వ్యక్తులు బాలికను ఎవరూలేని ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించి.. బాధితురాలిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

కాగా.. ఆ తర్వాత మళ్లీ జనవరి 11వ తేదీన నిందితుల్లో ముగ్గురు వ్యక్తులు మరోసారి బాలికను కిడ్నాప్ చేశారు. వారితోపాటు.. మరో ఇద్దరు లారీ డ్రైవర్ల సహాయంతో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిదగ్గరే బాలికను బంధించారు.

తాజాగా.. ఆ రాక్షసుల బారీ నుంచి బయటపడిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆ బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.