ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో 13 ఏళ్ల దళిత బాలిక మీద సామూహిక అత్యాచారానికి పాల్పడి.. బాలిక గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.  ఈ నేరానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తరప్రదేశ్‌ : UttarPradeshలోని చిత్రకూట్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఓ దళిత బాలిక తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి బయట నిద్రిస్తున్న బాలికను 
Kidnap చేసి gang rapeకి పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెడితే... ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో బుధవారం 13 ఏళ్ల దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురై, తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న బాలిక బుధవారం రాత్రి తన కుటుంబంతో కలిసి తన ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో సామూహిక అత్యాచారానికి గురైందని పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శర్మ పిటిఐకి తెలిపారు.

అత్యాచార బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లు ఆమె పోస్ట్ మార్టం నివేదిక ధృవీకరించింది. శవపరీక్ష రిపోర్ట్ శనివారం ఆలస్యంగా అందిందని, బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించామని పోలీసులు ఆదివారంతెలిపారు. ఆరుబయట నిద్రిస్తున్న బాలిక బుధవారం రాత్రి కనిపించకుండా పోయి.. గురువారం రెండు చేతులు కట్టివేయబడిన స్థితిలో దొరికింది. ఈ ఘటనలో నదీమ్, ఆదర్శ్ పాండే, విపుల్ మిశ్రా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు శర్మ తెలిపారు.

మైనర్ అపహరణ, సామూహిక అత్యాచారం
పహాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారనే ఆరోపణలతో చిత్రకూట్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం, బాధితురాలు తన ఇంటి బయట నిద్రిస్తుండగా, ఒక యువకుడు, కూలీ వారి ఇంట్లోకి ప్రవేశించి బాలికను అపహరించారు. ఆ తరువాత నిందితులు బాధితురాలిని సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు ఇంటి బయట కనిపించకపోవడంతో ఆమె కోసం వెతకడం ప్రారంభించామని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. పొలంలో పడి ఉన్న ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం కౌశాంబిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన బాలిక గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శవపరీక్ష నివేదికలోని వివరాలను పహాడీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అజిత్ పాండే ధృవీకరించారు. 

నిందితుడు కూడా బాలిక బంధువులతో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, కుటుంబ సభ్యులు సంఘటన గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని, చికిత్స కోసం ఆమెను కౌశాంబి జిల్లాకు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పలేదని, శుక్రవారం ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చామని ఎస్పీ తెలిపారు.పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారనే దానిపై కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.