ఓ టీచర్ ని మైనర్ బాలుడు దారుణంగా పొడిచి హత్య చేశాడు.  ఈ దారుణ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.... ఎందుకు చంపావు అని అడిగితే.. ఆ బాలుడు రకరకాల కారణాలు చెప్పడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయి కి చెందిన అయేషా అస్లామ్ హుసియా(30) భర్తతో విడిపోయింది. ఆమెకు వయసు మీదపడిన తల్లి, ఒక కుమారుడు ఉన్నారు. కాగా... వారిని పోషించేందుకు అయేషా ట్యూషన్లు చెబుతోంది. ఆమె వద్దకు దాదాపు 150మంది చిన్నారులు రోజూ చదువుకోవడానికి వస్తూ ఉంటారు. కాగా... వారిలోని ఓ 13ఏళ్ల మైనర్ బాలుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎందుకు చంపావు అన్న పశ్నకు పలు రకాల కారణాలు చెప్పడం గమనార్హం. తొలుత.. టీచర్ తో తన తల్లికి గొడవ జరిగిందని... అందుకే తన తల్లి ఆమెను చంపిందని చెప్పాడు. మరోసారి అడిగితే... తనను టీచర్ బాగా కొట్టిందని అందుకే కోపంతో చంపానని చెప్పాడు. మరోసారి అడిగితే... టీచర్ ని చంపేయమని  తనకు రూ.2వేలు ఓ వ్యక్తి ఇచ్చారని అతను చెప్పడం గమనార్హం.

ఇదే విషయంపై ఇతర స్టూడెంట్స్ ని పోలీసులు ఆరా తీయగా... సదరు మైనర్ బాలుడు హోమ్ వర్క్ చేయకుండా ట్యూషన్ కి వచ్చినట్లుతెలిసింది. కోపంతో టీచర్ అతనిని బయటకు పంపించేసింది. ఆ తర్వాత ఆ బాలుడు కిచెన్ లో ఉపయోగించే కత్తి ఒకటి తీసుకొని వచ్చి... బాత్రూమ్ లో ముఖం కడుకుంటున్న టీచర్ ని కత్తితో పొడిచేశాడు. పలుమార్లు కత్తితో పొడవడంతో... తీవ్రరక్తస్రావం జరిగింది.

తోటి ఉపాధ్యాయులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా... అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.