రాయపూర్: ఛత్తీస్ గడ్ లోని బస్తర్ అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. శనివారం రాత్రి ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల సంఘటనలో 4గురు భద్రతా బలగాల జవాన్లు మరణించినట్లు అనుమానిస్తున్నారు. సుకుమా జిల్లాలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. 

ఈ ఘటనలో 13 మంది జవాన్లు గల్లంతు కాగా, 14 మంది గాయపడ్డారు. మావోయిస్టుల కోసం  550 మంది ఎస్టీఎఫ్ డీఆర్జీ జవాన్లతో భారీ ఆపరేషన్ చేపట్టారు. చింతగుఫా ప్రాంతంలోని కోరాజ్ గుడా కొండ ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంటకు ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్ గడ్ పోలీసు డైరెక్టర్ జనరల్ డీఎం అవస్తి చెప్పారు. 

ఒంటి గంట తర్వాత పలుమార్లు ఎన్ కౌంటర్ జరిగినట్లు, 13 మంది జవాన్లు గల్లంతై, 14 గాయపడిన తర్వాత భద్రతా బలగాలు వెనక్కి వచ్చాయని ఆయన చెప్పారు.

13 మంది జవాన్లు గల్లంతైనతర్వాత ఆదివారం పెద్ద యెత్తున బలగాలను సంఘటనా స్థలానికి పంపించినట్లు ఆయన తెలిపారు. మాడవి హిద్మా నాయకత్వంలోని మావోయిస్టు బలగాలతో ఎన్ కౌంటర్ జరిగినట్లు డీజీపీ చెప్పారు. దాదాపు 300 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. మింపా ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు కూడా సమావేశమైనట్లు సమాచారం రావడంతో ఆపరేషన్ చేపట్టినట్లు తెలిారు.